మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

🙏 గోవింద నామమే శరణం 🙏

Nuthanganti Raju
చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం ఉదయం 9 నుంచి సాయంత్రం 7:30 వరకు మూసివేత.

మార్చి 3న చంద్రగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం తాత్కాలికంగా మూసివేత

తిరుమల: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3వ తేదీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు, సుమారు 10 గంటల 30 నిమిషాల పాటు ఆలయ తలుపులు మూసివేయబడతాయి.

చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు ప్రారంభమై 6.47 గంటలకు ముగుస్తుంది. ఆనవాయితీ ప్రకారం గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది.

గ్రహణం అనంతరం సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమాలు, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభమవుతుంది.

చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున నిర్వహించాల్సిన ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ నిలిపివేసింది.

అదే విధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐలకు సంబంధించిన దర్శనాలను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

— టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి

I

Share This Article
92 Comments
error: Content is protected !!